సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి జానపద చిత్రం, తొలి మల్టీ స్టారర్ ఒక్కటే. అది.. బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన 'ఇద్దరు మొనగాళ్లు' చిత్రం. ఈ మూవీలో కాంతారావు, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. 'గూడచారి 116' రిలీజ్ అయిన వందో రోజున 'ఇద్దరు మొనగాళ్లు' సినిమాలో నటించే అవకాశం కృష్ణకు రావడం విశేషం. ఈ మూవీలో కృష్ణ టార్జాన్ వేషంలో కనిపించడం ఇంకో విశేషం. సగం సినిమాలో ఆయనకు అసలు మాటలే ఉండవు. కేవలం ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి.
ఈ సినిమాలో గజ పురాధిపతి సింహబాహు పాత్రలో సత్యనారాయణ, ఆయన భార్య శీలావతిగా పుష్పకుమారి నటించారు. వారి పెద్ద కొడుకు రాజశేఖరునిగా కాంతారావు, పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై అడవి మనిషిగా పెరిగిన రెండో కుమారునిగా కృష్ణ కనిపిస్తారు. కాంతారావు సరసన కృష్ణకుమారి, కృష్ణ జోడిగా సంధ్యారాణి నటించారు. 'కన్నె మనసులు' సినిమా తర్వాత కృష్ణ, సంధ్యారాణి జంటగా నటించిన సినిమా ఇదే.
ఇందులో మాంత్రికుడు ధూమకేతువు అనే ప్రతి నాయకుడు పాత్రను నెల్లూరు కాంతారావు చేశారు. రమణారెడ్డి, రామదాసు, రావి కొండలరావు, సారథి, మోదుకూరి సత్యం, కాశీనాథ్ తాత, గణేష్, వేళంగి, రఘురాం, సుకన్య, తిలకం ఇతర పాత్రధారులు.
'ఇద్దరు మొనగాళ్లు' సినిమాని మొదట 1967 ఫిబ్రవరి 16న విడుదల చేయాలని నిర్మాత పి. మల్లికార్జున రావు అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో కరెంటు కొరత తీవ్రంగా ఉండేది. సినిమా హాల్లో జనరేటర్లు ఉండేవి కావు. పైగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కార్మికుల సమ్మె కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అందుకే విడుదల వాయిదావేసి పరిస్థితి చక్కబడ్డాక మార్చి 3న రిలీజ్ చేశారు.
ఎస్పీ కోదండపాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటల్ని సి. నారాయణరెడ్డి, వీటూరి, దాశరథి, ఆరుద్ర రాశారు. వరదరాజన్ సినిమాటోగ్రఫీ సమకూర్చగా, రవికాంత్ నగాయిచ్ కెమెరా ట్రిక్స్ సమకూర్చారు.